స్కిల్ యూనివర్సిటీ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నమని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం యువతను పట్టించుకోలేదని.. నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు స్కిల్ వర్సిటీ వల్ల లబ్ధి చేకూరుతుందని.. స్కిల్ వర్సిటీలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ సభ్యుల నినాదాలే మధ్యే అసెంబ్లీ కొనసాగుతోంది. సభలో పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. సభలో గట్టిగా నినాదాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. సభలో గులాబీ నేతలు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని తప్పుబట్టారు. యువత ప్రయోజనం కంటే బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తే ముఖ్యం అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ యువత భవిష్యత్ కోసం సహకరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర యువత బీఆర్ఎస్ సభ్యుల చేష్టలను గమనిస్తోందన్న శ్రీధర్ బాబు కచ్చితంగా వారికి బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు.