నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షల్లేవు : తలసాని

-

దేశంలో ఎక్కడా ఇంత పెద్దగా వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయడం లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. గణేశ్​ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు.

ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 1 నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌ వరకు వెళ్లి పరిశీలించారు. పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు నిమజ్జనం కోసం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఓవైపు గణేశ్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు ర్యాలీలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదని తలసాని అన్నారు.

నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని తలసాని స్పష్టం చేశారు. బీజేపీ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. పండగలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇవాళ ఖైరతాబాద్‌ మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. పర్యావరణహిత గణేశ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news