భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. అశ్వారావుపేట కాలేజ్‌లో హార్టీకల్చర్ కోర్సు ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను ఇవాళ ఆయన సందర్శించారు. పామాయిల్లో అంతర పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. కరెంట్ బిల్లులు భారం కాకుండా రూ.30 కోట్లతో బయో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో సంస్థపై కరెంటు భారం కొంతవరకు తగ్గుతుందని వివరించారు.
“మే నెల లోపు బయో ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తాం. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను. ఈ ప్రాంతం కొబ్బరి, జాజి, మిరియాలు, వక్క తదితర పంటలకు చాలా అనువుగా ఉంది. రైతులకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తాం. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు అనుబంధంగా ఉద్యాన తరగతుల ఏర్పాటు కోసం త్వరలోనే వీసీతో చర్చిస్తాను. దివంగత నేత ఎన్టీఆర్ చొరవతో ఆయిల్ ఫామ్ సాగుకు బీజం పడింది.” అని మంత్రి తుమ్మల అన్నారు.