తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఒకరోజు విరామం తర్వాత తిరిగి ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి సమావేశంలో కృష్ణా జలాల వివాదం, ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తోంది. కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కృష్ణా ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్‌పైకి పోలీసులను పంపిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేదిలేదని స్పష్టం చేశారు.
“రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించేలా కొందరు మాట్లాడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నదీ జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించాం. రోజుకు 3 టీఎంసీలు ఏపీ అక్రమంగా తరలించుకు వెళ్లింది. పదేళ్లపాటు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ 219 టీఎంసీలకు బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకుంది. ప్రతి ఏడూ దిల్లీకి వెళ్లి 512: 219 టీఎంసీలకు ఒప్పుకున్నారు. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో బీఆర్ఎస్ సర్కారు విఫలమైంది. బచావత్ ట్రిబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు.” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.