తెలంగాణ కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఆశావాహుల జాబితాను కాంగ్రెస్ హై కమాండ్ కు పంపినట్టు సమాచారం. హై కమాండ్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కలిసి మంత్రి వర్గ విస్తరణ పై అధికారికంగా సమాచారం అందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా అత్యంత త్వరలోనే కేబినెట్ లో నలుగురు కొత్త మంత్రులు చేరే అవకాశముందని తెలుస్తోంది.
కేబినెట్ విస్తరణ పై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఫిలిప్పిన్స్ కి బియ్యం ఎగుమతులను ప్రారంభించిన ఆయన కేబినెట్ విస్తరణ పై మీడియా ప్రశ్నించగా.. తనకు ఈ విషయం పై ఎలాంటి సమాచారం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేబినెట్ విస్తరణను అధిష్టానం ఖరారు చేసిన వేళ.. స్వయంగా ఓ మంత్రి దీనిపై అవగాహన లేదని చెప్పడం రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.