తెలంగాణ ఉద్యమ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ మరణం పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కళాకారులు సాయిచంద్ ఇంటికి చేరుకుని అతడి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా సాయిచంద్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సాయిచంద్ మృతదేహాన్ని చూసి వేముల కంటతడి పెట్టారు.
‘తమ్ముడు సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే బాధగా ఉంది. చిన్న వయసులో చనిపోవడం దురదృష్టం. నిజాయితీ గల సైనికుడు సాయిచంద్. సాయి పాట ఖండాంతరాలు దాటాయి. నా మనుసుకు దగ్గర తమ్ముడు సాయిచంద్. చాలా సార్లు మా ఇంటికి వచ్చాడు. సీఎం కెసీఆర్ కూడా సాయిని ఇంకా ఎక్కువ గౌరవించుకోవాలి అంటూ ఉంటారు. సాయిను మళ్లీ చూడలేమన్న ఆలోచనే బాధగా ఉంది.’ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.