రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాల్లో అత్యాచారం చేసే పరిస్థితి ఏర్పడింది: ఎమ్మెల్యే సీతక్క

-

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. సోనియాగాంధీ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకు వచ్చి పట్టాలు ఇస్తే నేడు ఆ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.

కెసిఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అడవి బిడ్డలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని అన్నారు. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. పబ్బులు, క్లబ్బులు నిబంధనలకు విరుద్ధంగా నడిచినా నిద్ర పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో సాక్షాత్తూ ప్రభుత్వ వాహనాల్లో అత్యాచారం చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో అత్యాచారం జరిగిన ఘటన జరిగి పది రోజులు దాటినా ఇప్పటివరకు అసలు నిందితులను అరెస్టు చేయకుండా దాచి పెడుతున్నారని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రోడ్డుపై మర్డర్లు,పరువు హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు సీతక్క. హైదరాబాదులో అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయకుండా, దోషులను శిక్షించకుండా తప్పించాలని చూస్తున్నారని అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో రాజకీయ ప్రయోజనం పొందడం టీఆర్ఎస్, బిజెపికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news