బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాబితా విడుదల తర్వాత అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ధన్ ఎమ్మెల్యే షకీల్ గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బీసీబంధు చెక్కులను, రెండో విడత గొర్రెల పంపిణీని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటును ఇతర పార్టీలకు వేసి వృథా చేసుకోవద్దని, కొందరికి తనమీద కోపమున్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఓటువేసి మరోసారి ఆయన్ని సీఎం చేయాలని కోరారు. బీఆర్ఎస్.. బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వమని, బీసీ రుణాలు, గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడం పవిత్రకార్యంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.3 వేల కోట్లతో బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.