తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన సవాల్
విసిరారు. సీఎల్పీ మీడియా పాయింట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మాట్లాడారు. 2014 ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రెండు రోజుల నుంచి కేసీఆర్, జగదీష్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అన్నారు. మేమే తెలంగాణ తెచ్చామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని.. పదేండ్లలో బీఆర్ఎస్ హయాంలో అనేక స్కామ్ లు జరిగాయని గుర్తు చేశారు.
మాజీ విద్యుత్ శాఖ మంత్రి ఎలాంటి అక్రమాలు జరగలేదని.. జ్యుడీషియల్ విచారణ చేయమన్నాడని గుర్తు చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే జగదీష్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడారని.. ఇప్పుడు విచారణ చేపట్టొద్దని కేసీఆర్, జగదీష్ రెడ్డి అంటున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చెప్పకుండానే జగదీష్ జ్యుడీషియల్ విచారణ చెయ్యమన్నారా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు బయట పడతాయనే ఇప్పుడు జ్యుడీషియల్ విచారణకు హాజరు కావడం లేదన్నారు. ఈ చర్యలతో విద్యుత్ రంగాన్ని అంధకారంలో నెట్టే ప్రయత్నం చేశారని అర్ధం అవుతుందన్నారు. పోరాడే తత్వం ఉన్న కేసీఆర్ ఎందుకు దొడ్డి దారి వెతుక్కుంటున్నాడో చెప్పాలన్నారు.