తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. అధికారంలో ఏ పార్టీ ఉంటే.. ఆ పార్టీలో చేరుతున్నారు పలువురు నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అలాగే జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అదేవిధంగా జరుగుతోంది. ఇటీవల పలువురు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ చేరారు.
తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేరిక పై పార్టీ అధిష్టానం కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు జీవన్ రెడ్డి. ఆయన పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు చేరుకొని పార్టీకి రాజీనామా చేయకుండా బుజ్జగిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తన అనుచరుల ఫోన్ ఎత్తకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ , ఎంపీ ఈటెల రాజేందర్ కలువనున్నారు. బీజేపీలోకి ఆహ్వానించే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది.