బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు.. ఆదిత్య, ఆర్య చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల వారిద్దరూ కలిసి సినర్జీ ఆఫ్ మైండ్స్(ఎస్ఓఎం) ఫౌండేషన్ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ సోదరులు.. ఆడబిడ్డల చదువుకు చేయూతనిచ్చారు. హైదరాబాద్, బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో అడ్మిషన్ లభించిన ఆర్థికంగా వెనుకబడిన పది మంది విద్యార్థినులకు ఫౌండేషన్ ద్వారా ఉపకారవేతనాలు అందజేశారు.
ఈ పది మందిలో ఆరుగురు అండర్ గ్రాడ్యుయేట్, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ఉన్నారు. కాలేజీలో ఎమ్మెల్సీ కవిత, కళాశాల ప్రతినిధుల సమక్షంలో ఆదివారం రోజున విద్యార్థులకు స్కాలర్షిప్పులను ఆదిత్యా, ఆర్య పంపిణీ చేశారు. తన కుమారులు ఇద్దరూ ఫౌండేషన్ను స్థాపించి విద్యార్థులకు చేయూత ఆందించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమాజానికి తమ వంతు సేవ చేస్తూ తమ తాత బాటలోనే పయనిస్తున్నారని అన్నారు. కళాశాలలో పదేళ్లపాటు స్కాలర్షిప్పులు ఇచ్చేందుకు ఫౌండేషన్ కళాశాలతో ఒప్పందం చేసుకుంది.