ఓటింగ్​కి గంటన్నర ముందు మాక్‌ పోలింగ్‌.. సీఈసీ మార్గదర్శకాలు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆ ఓట్లను తొలగించాలని సూచించింది. మాక్‌ పోలింగ్‌తో సాధారణ పోలింగు నిర్వహణ జాప్యం అవుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో గంటన్నర ముందుగా నిర్వహించాలని పేర్కొంది.

మాక్‌ పోలింగ్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీసం 50 ఓట్లు వేయాలని.. ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వేశారన్నది నమోదు చేయాలని మార్గదర్శకాల్లో తెలిపింది. అప్పటికప్పుడే ఓట్ల లెక్కింపు, వీవీప్యాట్‌లోని స్లిప్పుల లెక్కింపూ జరిగిపోవాలని.. అన్నీ సరిపోయాయా? లేదా? అని నిర్ధరించుకోవాలని చెప్పింది. ఒకవేళ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన పక్షంలో ఆ యంత్రాన్ని తొలగించి మరో యంత్రంతో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని పేర్కొంది. మాక్‌ పోలింగ్‌లో వేసిన ఓట్లను విధిగా తొలగించాలని, పోలింగ్‌ ఏజెంట్లకు వాటిని చూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news