గొర్రెల పంపిణీలో ట్విస్ట్.. వాటి స్థానంలో నగదు బదిలీకి సర్కార్ నిర్ణయం

-

మునుగోడు ఉపఎన్నిక వేళ గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది. ఈసారి గొర్రెల పంపిణీకి బదులు.. ఇదే పథకం కింద లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం మొదట నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.

ఎన్నికల కోడ్ రాకముందే నియోజకవర్గంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేసింది. 93.78 కోట్ల రూపాయలను రాష్ట్ర పశుసంవర్థక శాఖ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. గొర్రెల యూనిట్ కొనుగోలు చేసి చూపితేనే నిధులు డ్రా చేసుకునేందుకు వెలుసుబాటు ఇవ్వాలంటూ ఎంపీడీవోల ద్వారా బ్యాంకులకు ఆదేశాలు పంపడంతో లబ్ధిదారులు నిరాశకు గురయ్యారు.

సెప్టెంబర్ 30 అర్ధరాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నా.. పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఇంతలోనే సంబంధిత అకౌంట్లను ఫ్రీజ్‌ చేయాలని ఎంపీడీవోల ద్వారా బ్యాంకులకు ఉత్తరాలు వెళుతున్నాయి. 20 గొర్రెలు, ఒక విత్తనం పొట్టేలు యూనిట్ కొనుగోలు చేసి చూపితేనే బ్యాంకుల నుంచి లబ్ధిదారులు సొమ్ము ఉపసంహరించుకునేందుకు వెలుసుబాటు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు వెళ్లడంతో.. తాత్కాలికంగా ఉపసంహరణ నిలిపేశారు.

గొర్రెల పంపిణీ పథకం నగదు బదిలీ ప్రక్రియ మునుగోడు నియోజకవర్గంలో వియజంతమైతే రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంపిణీలో అమలు చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news