బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ కు పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు మద్దతునిచ్చేందుకు ముందుకొచ్చాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్తామంటూ కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్ర, కర్ణాటకలను ఎంపిక చేసినట్లు కేసీఆర్ తెలిపారు. అప్పటి నుంచి కర్ణాటకలో జేడీ(ఎస్)తో కలిసి బీఆర్ఎస్ పోటీ చేస్తుందనే ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా.. కేసీఆర్ కు షాక్ ఇచ్చారు జేడీఎస్ నేత కుమారస్వామి. 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీతో కలిసి పోటీ చేయబోమని క్లారిటీ ఇచ్చారు.
కర్ణాటకలో తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కానీ బీఆర్‌ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోమని కుమారస్వామి స్పష్టం చేశారు. కోలార్, రాయచూరుతో పాటు సరిహద్దు ప్రాంతాల నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులకు కేసీఆర్ అన్ని విధాలా సహకారం అందించనున్నారని తెలిపారు. జేడీఎస్ జాతీయ రాజకీయాలపై ప్రశ్నించగా.. తమది చిన్న పార్టీ అని.. కర్ణాటకలో మాత్రమే పోటీలో ఉంటామని కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు.