తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగిసింది. దరఖాస్తులు లక్ష దాటినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది లక్ష దరఖాస్తులను టార్గెట్ గా పెట్టుకున్న సర్కార్.. ఆ లక్ష్యం చేరువుతుందో లేదోనని కాస్త గందరగోళంలో పడింది. కానీ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని సాధించింది.
చివరి రోజు కావడంతో ఇవాళ భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరించారు. చివరి రోజు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. గురువారం వరకు 69,965 వచ్చిన దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,399 కోట్లు ఆదాయం సమకూరింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షలు తిరిగి ఇవ్వని నగదు చలాన్ (డీడీ)తో దరఖాస్తు సమర్పించారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయించనున్నారు. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద ఉన్నట్లు స్పష్టం చేసింది.