కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారానికి నాలుగు రోజులు కరీంనగర్ – తిరుపతి రైలు నడపనున్నట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి నట్టు పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు పడుతున్న ఇబ్బందులతో పాటు ఇతర రైల్వే సంబంధిత సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. తన వినతికి సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి కరీంనగర్-తిరుపతి మధ్య రెండు రోజులు నడుస్తున్న రైలు ఇకనుంచి నాలుగు రోజులపాటు నడపాలని అధికారులను ఆదేశించారని వెల్లడించారు.
మరోవైపు పెద్దపల్లి-నిజాంబాద్ రైల్వే లైన్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఎదురు అవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చోట రోడ్డు అండర్ బ్రిడ్జి డ్రైనేజీలను మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు. అదేవిధంగా కరీంనగర్ హసన్పర్తి కొత్త రైల్వే లైను సర్వే పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్ప్రెస్, దానాపూర్ ఎక్స్ప్రెస్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ తో పాటు మరిన్ని రైళ్లకు హాల్టు కల్పించే విధంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.