దేశభద్రతకు ముప్పు వాటిళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్కులో బీజేపీ ఇవాళ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో కమలం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై దిల్లీ పెద్దల ఒత్తిడి ఉందా? అని అడిగారు.
ఈ కేసులో పూర్తి వివరాలు ఉండకుండా ధ్వంసం చేశామని నిందితులు విచారణలో పేర్కొన్నారని.. దేశంలో ఉగ్రవాదానికి సంబంధించిన వ్యవహారంలో హైదరాబాద్ మూలాలు ఉన్నాయని లక్ష్మణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడినని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేసిన లక్ష్మణ్.. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు.