హైదరాబాద్‌లో ముంబయి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కూకట్‌పల్లి కోర్టు ఎదుట ముంబయి పోలీసుల అత్యుత్సాహం తిరిగి వారినే ఇరకాటంలోకి నెట్టింది. అసలేం జరిగిందంటే..?
నైజీరియాకు చెందిన ఒకోరోకో ఇకేటు ముంబయిలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా కొనసాగుతున్నాడు. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి గురువారం కూకట్‌పల్లిలోని న్యాయస్థానంలో హాజరుపర్చారు. విచారించిన ఎనిమిదో మెట్రోపాలిటన్ న్యాయమూర్తి భవాని నిందితుడికి బెయిలు మంజూరు చేశారు.
ముంబయిలో అప్పటికే డ్రగ్స్ కేసులో రిచ్ నిందితుడిగా ఉండటంతో అతణ్ని అరెస్టు చేసేందుకు అక్కడి పోలీసులు కూకట్‌పల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. తనను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న జడ్జి ముంబయి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో నిందితుడిని అరెస్ట్ చేసే ప్రక్రియను పాటించాలని చెప్పారు. న్యాయమూర్తి ఆదేశాలను బేఖాతరు చేస్తూ, బలవంతంగా నైజీరియన్‌ను వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీంతో వారిపై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.