తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జోరు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ ఆశిస్తోంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులకు తప్ప మిగతా అభ్యర్థులందరికీ బీఆర్ఎస్ తరపున కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. మరోవైపు ఈసారి సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి పక్షాలు కూడా బీఆర్ఎస్ కి చెక్ పెట్టేందుకు యత్నాలు చేస్తున్నాయి.
అయితే సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. అదేవిధంగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు గజ్వేల్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను పోటీ చేస్తానని కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇవాళ సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫామ్ అందజేశారు. ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. త్వరలోనే మిగతా మూడు నియోజకవర్గాలకు కూడా బీ -ఫామ్ అందజేయనున్నారు.