తెలంగాణ వ్యాప్తంగా ఓ వైపు బతుకమ్మ సంబురాలు షురూ అయ్యాయి. మరోవైపు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో దుర్గామాత వివిధ అలంకారాల్లో దర్శనమిస్తున్నారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవార్లను దర్శంచుకోవడానికి భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు చేరుకుంటున్నారు. ఆలయాల పరిసరాలన్నీ అమ్మవార్ల నామస్మరణలతో మార్మోగుతున్నాయి.
వరంగల్ వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. మొదటి రోజు అమ్మవారు.. బాలా త్రిపురసుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు… అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు నిర్మల్ జిల్లాలోని చదువులతల్లి బాసర సరస్వతీదేవి ఆలయంలో శ్రీ శారదియ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. శైలపుత్రి అవతారంలో దర్శనిమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు…. అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇంకోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలకు రూ.10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఆధికారులు తెలిపారు.