కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనూ ఈ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లో నిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఏదైనా జరిగినప్పుడే పార్టీల నేతలు స్పందిస్తున్నారని.. కొన్ని రోజుల తర్వాత అంతా మరిచిపోతున్నారని వాపోయారు. డ్రాఫ్ట్ బిల్లులు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నామని అన్నారు. ముందు మా ప్రాణాలు కాపాడండి.. తర్వాత రోగుల ప్రాణాలు కాపాడుతాం అంటూ వైద్యులు నినదించారు. ఈ సందర్భంగా కోల్ కతా యువతి హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని నిమ్స్ వైద్యులు డిమాండ్ చేశారు. విధుల నిర్వహణలో రక్షణ కల్పించాలని వైద్యులు, సిబ్బంది నినాదాలు చేశారు. తమ నిరసన కారణంగా అత్యవసర సేవలకు ఆటంకం ఉండదని .. వైద్య సిబ్బంది రక్షణకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు డిమాండ్ చేశారు.