రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిగా వాన పడుతోంది. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచి నిజామాబాద్ జిల్లాలో జోరు వాన కురుస్తోంది. అన్ని మండలాల్లో కురుస్తున్న ఎడతెరిపి వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు నిండిపోయాయి. ఇవాళ, రేపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా అధికారులను సీఎస్ శాంతి కుమారి అప్రమత్తం చేశారు. భారీ వర్ష సూచన దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏకధాటి వానతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి 30 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎస్సారెస్పీ నీటినిలువ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 85.3 టీఎంసీలు.