పాత కార్డులకు చెక్..తెలంగాణలో ఇకపై డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెడీ అయింది రేవంత్ రెడ్డి సర్కార్. చాలా రోజుల నుంచి ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేశారు. గురువారం రోజున సచివాలయంలో జరిగిన సమావేశంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల అంశంపై రేవంత్ రెడ్డి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులను అక్టోబర్ మొదటివారంలో తీసుకొని నెల చివరి వరకు అర్హుల జాబితాను ఫైనల్ చేసి కార్డులని లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. అయితే ఈ అంశంపైన త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.