తెలంగాణలోని వికారాబాద్ జిల్లా లగచర్లలో తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో ఇవాళ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. ఫార్మావిలేజ్ కు భూ సేకరణ విషయంలో కొద్ది సేపటి కిందనే కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై గ్రామస్తులు దాడి చేసినట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కలెక్టర్ స్పందించారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో తన పై దాడి జరిగినట్టు వస్తున్నటువంటి వార్తలను ఆ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఖండించారు. తన పై దాడి జరగలేదని స్పష్టం చేశారు. గ్రామస్తులు మాట్లాడేందుకు తమను పిలిచారని.. వారితో చర్చలు జరిపామని తెలిపారు. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశాయని.. ఈ ఘటన పై దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు. పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడి నిరసన విరమింపజేసినట్టు తెలిపారు కలెక్టర్ ప్రతీక్ జైన్.