మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పద్మవిభూషణ్కు ఎంపిక కావడంపై వెంకయ్యనాయుడు స్పందించారు. పద్మవిభూషణ్ ఇచ్చిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం నా బాధ్యతలు మరింత పెంచిందని అన్నారు.
రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించానని వెంకయ్యనాయుడు అన్నారు. తన జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని.. రాజకీయాలు పక్కనపెట్టి దేశాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు దేశ ప్రజలకు వెంకయ్య నాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
“యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన నాటినుంచీ గ్రామాలు, రైతులు, మహిళలు, యువత సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్నా. నా బాధ్యతలను ఈ పురస్కారం మరింత పెంచింది. ఆత్మనిర్భర నవభారత నిర్మాణం కోసం ప్రజలతో కలిసి ఆ దిశగా పయనిస్తానని హామీ ఇస్తున్నా.” – వెంకయ్యనాయుడు