తెలంగాణలో హైడ్రా కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు ఏపీ సచివాలయంలో ఆయా జిల్లాలో కలెక్టర్లతో వరదలపై సమీక్ష నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి మంచి పని చేశారని అన్నారు. కానీ ఈ అంశంలో కాస్త ఆలోచించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
హైడ్రా కూల్చివేతలు సామాజిక సమస్యగా మారే అవకాశం ఉందన్నారు. 20 ఏళ్లుగా ఏఫ్టీఎల్ లో నిర్మాణాలు జరుగుతున్నాయని.. చెరువుల్లో నిర్మాణాలు చేస్తుంటే తాను ఆందోళన చెందానన్నారు. నీరు వచ్చే అవకాశం లేదని ప్రజలు ఇల్లు కట్టుకున్నారన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా కూల్చివేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని.. కూల్చివేశాక ప్రత్యామ్నాయం చూపల్సి ఉంటుందన్నారు.
అసలు అక్రమ నిర్మాణాలను ముందే అడ్డుకొని ఉంటే ఎలాంటి సమస్యలు ఉండేవి కావన్నారు. ఏపీలోనూ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలపై కఠినంగా ఉంటామని తెలిపారు. హైడ్రా లాంటివి ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా ఉండాలని తెలిపారు.