పొత్తులపై కొండగట్టులో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో వారాహి ప్రచార రథానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న అంటే తనకు నమ్మకం అని చెప్పారు. తనకి ప్రాణగండం ఉందని తెలియగా అంజన్నను దర్శించుకున్నానని.. ఆ తర్వాత ఓ హై టెన్షన్ తీగ తనపై పడిందన్నారు.

ఆ సమయంలో తన వెంట ఉన్న వారికి షాక్ కొట్టగా.. ఆ దేవుడి దయతో తనకి మాత్రం కేవలం జుట్టు మాత్రమే కాలిపోయిందని తెలిపారు. తనకి కొండగట్టు పునర్జన్మనిచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక ఏపీలో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బిజెపితో పొత్తు ఉందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. 2014 కాంబినేషన్ పునరావృతం పై కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. ఎన్నికలు వారంలో ఉంటే పొత్తులపై లోతుగా మాట్లాడవచ్చని పేర్కొన్నారు. ఎవరు వచ్చినా, రాకున్నా ముందుకి వెళతామని.. ఎవరూ రాకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పేశారు.