రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా గ్రామాల్లో వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. పలుచోట్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయినా కొందరు ప్రమాదకరంగా వాగును దాటేందుకు ప్రయత్నించి అందులో గల్లంతవుతున్నారు. మరికొందరేమో.. పనులపై బయటకు వెళ్లి అకస్మాత్తుగా వచ్చిన వరద ఉద్ధృతితో అక్కడే చిక్కుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
జిల్లాలో గోదావరి, మానేరు, తీగలవాగు, ఆరె వాగులు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మానేరు వాగు ఉప్పొంగడంతో మంథని మండలం గోపాల్పూర్ ఇసుక క్వారీలో 12 మంది చిక్కుకున్నారు. వారిలో ఒకరు గల్లంతైనట్లు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, రెవెన్యూ, పోలీస్ అధికారులు చేరుకుని వారిని సురక్షితంగా తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టారు. మల్హర్ మండలంలోని ఆరెవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కొయ్యూరు తాడిచెర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాడిచెర్ల రెవెన్యూ ఆఫీస్ చుట్టూ వరద నీరు చేరింది. అడవి సోమనుపల్లి వద్ద మానేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు.