రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రగతికి కేంద్రం తోడ్పడుతుందని చెప్పారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో పర్యటించిన ప్రధాని రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసర్చ్ కేంద్రం ఏర్పాటు చేశామని, ఇది దేశంలోనే మొదటదని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్, తెలంగాణకు గుర్తింపు వస్తుందని చెప్పారు. ఏవియేషన్ కేంద్రం స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని వెల్లడించారు.
“140 కోట్ల దేశ ప్రజలు వికసిత్ భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నారు. వికసిత్ భారత్ కోసం మౌలిక సౌకర్యాల కల్పన ఆవశ్యకం. మౌలిక సౌకర్యాల కోసం బడ్జెట్‌లో రూ.11 లక్షల కోట్లు కేటాయించాం. సంగారెడ్డి నుంచి మదీనగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య అనుసంధానత ఏర్పడుతుంది. దక్షిణ భారత్‌కు గేట్‌వేలా తెలంగాణ నిలుస్తుంది.” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.