ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ మోదీ.. ఇందూరుకు రానున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు వస్తారు. 3 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రధాని మోదీ సభా స్థలికి చేరుకుంటారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. ఇక సభ అనంతరం సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో బీదర్‌కు తిరుగు ప్రయాణమవుతారు. బీదర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ దిల్లీకి వెళ్లనున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్రంలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేయనున్న మోదీ.. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్తగా రూ.6 వేల కోట్లతో నిర్మిచిన 800 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు మనోహరాబాద్- సిద్దిపేట కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. ధర్మాబాద్-మనోహరాబాద్ కొత్త లైన్ విద్యుదీకరణ పనులు, మహబూబ్‌నగర్- కర్నూల్ కొత్త లైన్ విద్యుదీకరణ పనులు, సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త రైలు సర్వీస్‌ను వర్చువల్‌గా మోదీ ప్రారంభించనున్నారు.