స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఒక్క రోజు దీక్షను చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు చేపట్టారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య, కుమార్తె నిషిక కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలేఖ్య మీడియాతో మాట్లాడారు. ఇవాళ తారకరత్న బతికుంటే కచ్చితంగా నిరసన దీక్షలో పాల్గొని ఉండేవాడని అన్నారు.
తారకరత్న బదులు తాను, తన కుమార్తె వచ్చామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అంటే తారకరత్నకు ప్రాణమని, ప్రాణం పోయేంత వరకు పార్టీతోనే ఉంటానని చెప్పేవాడని, అన్నట్టుగానే చివరిగా పార్టీ కార్యక్రమంలోనే పాల్గొన్నాడని గుర్తుచేసుకున్నారు. పార్టీకి సంబంధించి ఏ చిన్న కార్యక్రమం అయినా వెళ్లేవాడని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ప్రాణమని, చంద్రబాబునాయుడు ఆలోచన తీరు, ఆయన దార్శనికతను తారకరత్న ఇష్టపడేవారని అలేఖ్య వివరించారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడిచేవాడని తెలిపారు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టే నారా, నందమూరి కుటుంబాల వాళ్లు బయటికి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు బయటికి వచ్చేంతవరకు తాము పోరాటం ఆపబోమని, నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.