దక్షిణ కాశీ భగవానుడు రాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు అని వేములవాడ బీజేపీ బహిరంగ సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. కరీంనగర్‌లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపిందన్న మోదీ అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభావం కరీంనగర్‌లో మచ్చుకైనా కనిపించట్లేదని అన్నారు.
“మీ ఓటు వల్లే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. పదేళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. మా హయాంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చాం. వ్యవసాయ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేశాం” అని ప్రధాని మోదీ అన్నారు.