ఈ నెల 25 వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన 6 బహిరంగ సభలతో పాటు హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొననున్నారు. ఒకరోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనుండగా.. మరో రోజు తిరుమలకు వెళ్లి రానున్నారు. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ… అక్కడి నుంచి కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం మహేశ్వరం సభలో ప్రసంగం అనంతరం, రాజ్‌భవన్ చేరుకుని అక్కడే బస చేస్తారు.
26వ తేదీన మధ్యాహ్నం వరకు కన్హా శాంతివనంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తూప్రాన్ సభకు హాజరుకానున్న ప్రధాని…. తర్వాత నిర్మల్ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం తిరుపతికి వెళ్తారు. 27వ తేదీన శ్రీవారి దర్శనానంతరం తిరుపతి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి మహబూబాబాద్‌లో జరిగే సభకు హాజరుకానున్న ప్రధాని మధ్యాహ్నం కరీంనగర్‌లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు హైదరాబాద్‌లో రోడ్‌షోలో పాల్గొని, ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. అనంతరం తిరిగి దిల్లీకి పయనమవుతారు. అయితే మోదీ హైదరాబాద్ రోడ్ షో రూట్ మ్యాప్ ఇంకా సిద్ధం కాలేదు. దీనిపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.