తెలంగాణలో ఈసారి కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దించి.. కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా చర్యలు చేపడుతూ.. ఎన్నికలకు పటిష్ఠ ప్రణాళికను రచిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తూ.. మరోవైపు ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే మూడో వంతు స్థానాలకు అభ్యర్థులను గుర్తించిన పార్టీ హైకమాండ్.. కొందరి విషయంలో మళ్లీ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో ముఖ్య నేతలందర్నీ బరిలో దింపాలని గతంలో భావించినప్పటికీ, ఇప్పుడు ఈ అంశంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
మరోవైపు అభ్యర్థుల జాబితాలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బీసీలక సరైన సీట్లు కేటాయించకపోవడంతో.. వారి ఓట్లను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 40కు పైగా సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జాబితా ప్రకటించగానే రాష్ట్రంలో బీసీ గర్జన సభ నిర్వహించాలని కమలదళం యోచిస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలనుకుంటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలో ఈ నెలాఖరులోపు కేంద్రమంత్రి అమిత్‌షా, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారని వెల్లడించాయి