పార్లమెంట్ ఎన్నికల వేేళ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో నగదు, మద్యంతో పాటు డ్రగ్స్, గంజాయి కూడా పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్ కంట్రోల్ అధికారులు రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ సమాచారం అందించగా.. పీఎస్‌ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు 90 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న కస్తూరి రెడ్డిని అరెస్టు చేశారు. మరోవైపు సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్‌ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కొంతవరకు హైదరాబాద్‌లో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానిస్తున్నారు. పీఎస్ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.