మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన భవిష్యత్ ప్రణాళికపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూనే ఉంది. అయితే తాజాగా పొంగులేటి రాజకీయ పయనంపై స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. ఖమ్మంలో ఇవాళ ఉదయం అల్పాహార విందు భేటీకి హాజరుకావాలని మండలాల వారీగా ముఖ్య నాయకులకు పొంగులేటి సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యనాయకులు, అనుచరుల్లో అత్యధిక మంది కాంగ్రెస్‌లో చేరాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్నారు. రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత నుంచి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయనతోపాటు మాజీ మంత్రి జూపల్లి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ ఒకేసారి కాంగ్రెస్ గూటికి చేరతారని సమాచారం.