రాష్ట్ర విభజనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఇచ్చిన విభజన హామీలను పాతరేసి అబద్ధాల జాతర చేస్తామంటే సహించమన్నారు. ఆనాడో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని దగా చేశారు. ఇప్పుడు తెలంగాణ పుట్టకనే అవమానించిన బీజేపీకి.. ఇక్కడ పుట్టగతులుండవు అని పేర్కొన్నారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయడం ఆపండి అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ ఏర్పడినా సంబురాలు చేసుకోలేకపోయిందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని తెలిపారు మంత్రి కేటీఆర్. దాదాపు 6 దశాబ్దాలకు పైగా పోరాడి జూన్ 02, 2014న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అలాంటి రాష్ట్రానికి ఆవిర్భవ వేడుకలను జరుపుకోలేదని ప్రధాని చెప్పడం అజ్ఞానాన్ని సూచిస్తోందన్నారు. కాంగ్రెస్ ని విమర్శించే ప్రయత్నంలో మోడీ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ట్వీట్ చేశారు కేటీఆర్. 157 మెడికల్ కళాశాలలో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. తెలంగాణపై బీజేపీకి ఎంత కోపమో అర్థమవుతుందన్నారు.