రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో జోరు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తున్నారు. అలా ఓ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నిరసన సెగ తగిలింది.
సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్శించెర్ల సబ్ స్టేషన్ వద్ద సైదిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సైదిరెడ్డిని.. అడ్డుకున్న రైతులు గ్రామంలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంటలకు కరెంట్ సరిపోవడం లేదని చెప్పడంతో వెంటనే ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో మాట్లాడారు.
“రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాది. కాంగ్రెస్ మాటలు విని ఇలా చేయడం తప్పు. ఏమైనా సమస్య ఉంటే నా దగ్గరకి తీసుకురండి నేను పని చేయకుంటే అడగండి అంతే గానీ రోడ్డు మీద ధర్నా చేయడం తగదు.” అని రైతులతో ఎమ్మెల్యే హితవు పలికారు.