రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను రాచకొండ సీపీ సుధీర్ బాబు విడుదల చేశారు. రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే 6.86శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగినట్లు వెల్లడించారు. రాచకొండ పరిధిలో మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గాయన్న సుధీర్‌బాబు ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మంది అరెస్టు కాగా గేమింగ్ యాక్ట్‌పై 188 కేసులు నమోదు చేసిన 972 మంది అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ ఏడాది 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు చేశామని చెప్పారు. 20 కేసుల్లో నిందితులకు జీవితఖైదు పడిందని వివరించారు. 2,900 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశామన్న సీపీ రాచకొండ పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని వెల్లడించారు. ఈ ఏడాది ప్రమాదాల్లో 633 మంది మృతి చెందగా 3,205 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు 16 శాతం పెరిగాయని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన 8,758 ఫిర్యాదుల్లో 4,643 పరిష్కరించామని, కమిషనరేట్ పరిధికి సంబంధించిన నేరాల్లో 12.77 కోట్లు రికవరీ చేశామని వెల్లడించారు.