తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని తెలిపింది.
అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఇది ఇలా ఉండగా.. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 07.00 – 07.45 గంటలకు వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి భద్రాచలం ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక 09.30 గంటలకు భద్రాచలంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. 09.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా ఏటూరునాగారం వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన ఉండనుంది.