తెలంగాణలో గత నాలుగు, ఐదు రోజుల నుంచి వాతావరణ పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు జిల్లాలకు ఆరేంజ్ తో పాటు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ కి వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీమ్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.