తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 7, 8వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 7వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఇక 8వ తేదీన మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కురుస్తాయని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లోనూ ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయని చెప్పారు.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరించి చాలా రోజులు గడుస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు మాత్రం కురవడం లేదు. జూన్లో నామమాత్రపు వానలే కురిశాయి. అయితే జులైలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయని ఇటీవలే భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.