తెలంగాణపై సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్య తాపంతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా ఉమ్మడి జిల్లాలు వేడికి ఉడికిపోతున్నాయి. శుక్రవారం రోజున ఉమ్మడి జిల్లాల్లో భానుడు భగభగ మండిపోయాడు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారం(మంథిని)లో 46.4 డిగ్రీల సెల్సియస్ రికార్డయ్యాయి.
ఈ ఏడాది అత్యధిక ప్రాంతాల్లో 45 డిగ్రీలపైన ఉష్ణోగ్రత నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, ప్రణాళిక సంస్థ రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నట్లు సూచించింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు సూర్య తాపానికి తట్టుకోలేక రాష్ట్రంలో వడదెబ్బ తగిలి ముగ్గురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మోత్కూరి పెంటమ్మ(58) శుక్రవారం ఉపాధిహామీ పనులు చేస్తూ వడదెబ్బతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లికి చెందిన గుజ్జుల నరసింహ(38), మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని బాపూజీనగర్‌లో నివసించే యముడాల సాయికుమార్(31) ఎండకు అస్వస్థతకు గురై మృతిచెందారు.