తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నష్టం ఎంత మేరకు జరిగిందనే విషయం పై ఆరా తీశారు. శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు మంత్రికి వివరించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి బాధితుడిని ఆదుకుంటామని మంత్రి కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలను వర్ష ప్రభావిత జిల్లాలుగా ప్రకటించామని తెలిపారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది మరణించారని.. మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం కూడా అందజేయాలని అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి. వర్షాలతో దెబ్బ తిన్న ప్రతీ ఇంటికి రూ.16,500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. అలాగే వరద ముంపునకు నష్టపోయిన పంటకు ఎకరానికి రూ.10వేల చొప్పున ఇవాళ నుంచి అందజేస్తామని తెలిపారు మంత్రి.