ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్దమవుతున్న ప్రభుత్వం అంతకుముందే మరోసారి టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు పరీక్షలకు 90 రోజుల సమయం ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా షెడ్యూల్ లో కీలక మార్పులు చేస్తూ.. ప్రకటన చేసింది.
అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక అక్టోబర్ 4 నుంచి కీ విడుదల చేయనున్నట్టు, తుది ఫలితాలను నవంబర్ 2న విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెండన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 8 వరకు పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చునని, ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 నుంచి ఆన్ లైన్ లో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. జులై 22 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.