అయోధ్య రామమందిరం ప్రారంభోత్సం సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోందని.. దైవ కార్యాన్ని రాజకీయం చేయవద్దన్నారు. రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదని.. ఈ అంశాన్ని తమ పార్టీకి ఆపాదించి వివాదాస్పదం చేయద్దని అన్నారు.
తాజాగా బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లంతకుంట శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయం, కరీంనగర్ శివ రామాలయాల్లో స్వచ్ఛ అభియాన్ నిర్వహించారు. చీపురు పట్టి ఆలయం మొత్తం ఊడ్చారు. చెత్తను ఎత్తి పడేశారు. విగ్రహాలను పైపుతో నీటిని చల్లి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా బండి సంజయ్ విలేకర్లతో మాట్లాడారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని 11 రోజుల పాటు ఆలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ మోడీ పిలుపునిచ్చారని.. ఆయన పిలుపునకు లక్షలాది మంది స్పందిస్తోన్నారని పేర్కొన్నారు.