తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాజకీయ కాక పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నాయకులు.. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ చేస్తున్న ప్రచారాన్ని కాషాయ నేతలు తిప్పికొడుతున్నారు. తాజాగా ఈ అంశంపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పందించారు. రిజర్వేషన్లు పోవని.. కాంగ్రెస్ నేతల అబద్ధపు ప్రచారాన్ని, మోసపూరితమైన మాటలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నాచారంలో ఈటల సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు.
“పార్లమెంట్ ఎన్నికల్లో గెలవరేమో అనే అసహనంతో రేవంత్ రెడ్డి.. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఆయన్ను చూసి ఓట్లు వేయడం లేదని ఆయనకు కూడా అర్థం అయ్యింది. రిజర్వేషన్లు రద్దు చేస్తామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. EWS రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీని విమర్శిస్తున్నారు. ఏబీసీడీ రిజర్వేషన్ చేస్తా అని మందకృష్ణకు మద్దతు ఇచ్చిన నాయకుడు మోదీ. కేబినెట్లో సామాజిక న్యాయం తు.చ. తప్పకుండా పాటిస్తున్న పార్టీ బీజేపీ. ఇన్ని సంవత్సరాల్లో ఒక్క ఓబీసీని సీఎం చేశారా? ఓబీసీలకు ఇచ్చిన మంత్రిపదవులు ఎన్ని? 60 శాతం మందికి పదవులు ఇచ్చిన ఘనత ప్రధానిది.” అని ఈటల రాజేందర్ అన్నారు.