తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా బాధితులమేనని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడే కాదు.. అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోందని తెలిపారు. తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేశారని ఆరోపించారు.
“ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీశ్‌రావు కూడా బాధితుడే. అన్ని ఆర్థిక లావాదేవీలు నడిపింది ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావే. అశోక్‌రావును సీఎం వద్దకు తీసుకెళ్లింది కరీంనగర్ మంత్రే. రాజేందర్‌రావుకు టికెట్ వచ్చేందుకు ప్రధాన కారణం ప్రభాకర్ రావు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు చెప్పారు. రాధాకిషన్‌రావు ఏం చెప్పారో పోలీసు రికార్డులో ఉంది. పెద్దలు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌లో నేను, రేవంత్‌రెడ్డి కూడా బాధితులమే.” అని బండి సంజయ్ అన్నారు.