ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రచార జోరును పెంచిన కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతోంది. ముఖ్యంగా కీలక నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజయభేరీ సభలో పేరుతో రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇస్తే అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు తక్షణమే అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇస్తున్నారు.
కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, మోదీ, కేసీఆర్ బంధంపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారం సాగిస్తున్న రేవంత్.. ఇవాళ పాలకుర్తి, సికింద్రాబాద్, సనత్‌నగర్ సభల్లో పాల్గొననున్నారు. ఈ సభల అనంతరం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనున్న మైనారిటీ డిక్లరేషన్ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వివరిస్తూ తమకు అవకాశం కల్పించాలని రేవంత్ తన పర్యటనలో ప్రజలను కోరుతున్నారు.
బీఆర్ఎస్, బీజేపీలు డబ్బులున్న వారికే టికెట్లిచ్చాయని రేవంత్ ఆరోపించారు. బొజ్జులాంటి పేదలకు సైతం తమ పార్టీ ఎన్నికల్లో నిలబెట్టిందని తెలిపారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను పోటీ చేయనని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేసి.. అంతకంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో మరో పోస్టల్ అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.