తెలంగాణ డీజీపీతో కాంగ్రెస్ నేతల బృందం ఇవాళ సమావేశం అయింది. ఈనెలలో సీడబ్ల్యూసీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో భద్రత కల్పించాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరినట్టు తెలుస్తోంది. ఈనెల 16, 17వ తేదీల్లో హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 17వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభకు విజయభేరీగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే సభకు భద్రత అందించాలని డీజీపీని కోరామని వెల్లడించారు. విజయభేరీ సభకు ఆటంకాలు కలిగించడం సరికాదన్న రేవంత్ రెడ్డి సభకు ప్రభుత్వం ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. హోంగార్డు రవీందర్ అంశాన్ని కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఐదు నెలలుగా ప్రభుత్వం హోంగార్డులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీయడానికి కేసీఆర్ అవినీతే కారణమని ధ్వజమెత్తారు.హోంగార్డు రవీందర్ మరణానికి కూడా ప్రభుత్వమే కారణం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.